ఎర్రవల్లిలో నీటి పారకంపై రిపోర్ట్
- కలెక్టర్‌కు ఇరిగేషన్, హార్టికల్చర్ అధికారుల అందజేత
- పాండురంగ రిజర్వాయర్ నుంచి ‘డ్రిప్’ సంపులోకి జలాలు?
- భారీగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపు?
- నివేదికలో ఏమున్నదని స్థానికంగా తీవ్ర చర్చ
గజ్వేల్, అక్టోబర్ 26 : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫామ్‌హౌస్‌లోకి నీటి పారకంపై(Water flow) రిపోర్ట్ రెడీ అయ్యింది. ఆ నివేదికను కలెక్టర్ సమర్పించినట్లు నీటిపారుదల, ఉద్యానవన శాఖ(Irrigation and Horticulture Department) అధికారులు వెల్లడించారు. అయితే, ఆ నివేదికలో ఏమున్నదనే అంశం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాండురంగ రిజర్వాయర్(Panduranga Reservoir) ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు(Kondapochamma Project) నీటిని ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు(KCR Farmhouse) భారీ స్థాయిలో నీరు పంపిణీ అవుతున్నట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు.
హార్టికల్చర్ డీడీ సువర్ణ, ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీనివాస్, డీఈ చండీరామ్ సిబ్బందితో కలిసి పాండురంగ రిజర్వాయర్, ఎర్రవల్లిలోని సంపు హౌస్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను పరిశీలించారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. సంప్‌హౌస్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోని బావిలోకి గతంలో పైప్‌లైన్ల ద్వారా నీరు తరలించినట్టు అధికారులు తెలుసుకున్నారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువల తూముల ద్వారా ఫామ్‌హౌస్‌లోకి సాగునీరు అందుతున్నట్లు ప్రచారం జరిగినది తెలిసిందే. అయితే, పాండురంగ రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని బావిలోకి వెళ్తున్నదన్న విషయం బయటకు రావాల్సి ఉంది.
ఉమ్మడి వ్యవసాయం పేరుతో జల దోపిడీ?
పాండురంగ రిజర్వాయర్, డ్రిప్ ఇరిగేషన్ సంప్‌ల తనిఖీల్లో విచారణాధికారులు పలు కీలక అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
ఎర్రవల్లి, నరసన్నపేటల్లో ఉమ్మడి వ్యవసాయం పేరుతో కేసీఆర్ తన పంట పొలాలకు నీటిని తరలించారనే అనుమానాలు అధికారులకు కలిగినట్లు సమాచారం. ఉమ్మడి సాగు పేరుతో డ్రిప్ ఇరిగేషన్ పనిముట్లను సబ్సిడీ ద్వారా రైతులకు కేసీఆర్ పంపిణీ చేయించినట్లు చేసినట్లు తెలుస్తోంది. నెటాఫీమ్ మైక్రో ఇరిగేషన్ సంస్థ ద్వారా ఈ డ్రిప్ ఏర్పా పనులు ఎర్రవల్లిలో నిర్వహించారు.
ఆ సంస్థ సహకారంతోనే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించడానికి పైప్‌లైన్ నిర్మించుకోవవచ్చన్న అన్న సందేహాలు అధికారులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, కలెక్టర్‌కు నివేదిక అందించామని చెబుతున్న విచారణాధికారులు.. అందులో ఉన్న సమాచారాన్ని విలేకరులకు కూడా వివరించలేదు. ఈ క్రమంలో ఆ రిపోర్టులో ఎలాంటి వివరాలు ఉన్నాయోనన్న ఉత్కంఠ గజ్వేల్ ప్రాంత ప్రజల్లో నెలకొంది.