డీలిమిటేషన్‌పై కేటీఆర్ క్లారిటీ
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. కేటీఆర్ అసలు కారణం ఇదే!
హైదరాబాద్: డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్న తమ పోరాటం ఫలించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల పెంపుపై కేంద్రం ముందుకు రావడం సంతోషించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. Babasaheb Ambedkar) రూపొందించిన రాజ్యాంగ నిబంధనల ప్రకారం జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టాల్సి ఉంటుందని కేటీఆర్ గుర్తుచేశారు. 2021లోనే ఈ ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా (Covid-19) కారణంగా వాయిదా పడిందన్నారు. అయితే కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పునర్విభజిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని వివరించారు.
ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా గళమెత్తాయని, చెన్నైలో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని ప్రధానంగా చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామని కేటీఆర్(KTR) తెలిపారు. తమతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలు చేసిన ప్రయత్నాల ఫలితంగానే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే దిశగా ముందుకొచ్చిందని అన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రస్తుత సీట్ల సంఖ్యకు అదనంగా 50 శాతం సీట్లు పెంచే ప్రతిపాదనతో పాటు, దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని కేవలం ఒక పార్టీ విజయంగా కాకుండా దక్షిణాది రాష్ట్రాల సమిష్టి విజయంగా చూడాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తమ 24 శాతం వాటాకు నష్టం కలగకుండా డీలిమిటేషన్(Delimitation) చేపడతామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఈ బిల్లుకు మద్దతు తెలిపిందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన అంశాల్లో రాష్ట్రాల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినకూడదన్నదే తమ పార్టీ Stand అని ఆయన వెల్లడించారు.