రోడ్డుపై పొంచి ఉన్న పెను ప్రమాదం!

17-10-2026 | 09:16pm

ఎండిన భారీ వృక్షం కింద 11 కేవీ విద్యుత్ తీగలు..

ఎప్పుడు కూలుతుందోనని ప్రజల్లో ఆందోళన ప్రమాదం జరిగాక స్పందిస్తారా.. ముందే తొలగించరా?

తిరుమలాయపాలెం,(విజయ క్రాంతి): ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై తిరుమలాయపాలెం మండల పరిధిలోని మేకల తండా స్టేజీ వద్ద ఎండిపోయిన భారీ వృక్షం ప్రమాదకరంగా మారింది. వేర్లతో సహా బలహీనపడిన ఈ చెట్టు ఏ సమయంలోనైనా రోడ్డుపై కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఎండిన చెట్టు కొమ్మల కిందుగా 11 కేవీ విద్యుత్ తీగలు వెళ్తున్నాయి.

చెట్టు కూలిన సమయంలో విద్యుత్ తీగలు తెగిపడితే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో చెట్టు కూలితే వాహనదారులు, బాటసారులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన వృక్షాన్ని అధికారులు ఇప్పటికైనా గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కంటే ముందుగానే స్పందించి ఎండిన భారీ వృక్షాన్ని తొలగించాలని, విద్యుత్ శాఖ అధికారులు సైతం తీగల భద్రతపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు, బాటసారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు