అడెల్లి జాతరకు పోలీసు బందోబస్తు
నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలం(Sarangapur mandal) అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అమ్మవారి మహా జాతరను పురస్కరించుకుని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) తెలిపారు. అమ్మవారి ఆభరణాలు శనివారం రాత్రి దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామానికి చేరుకోనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆభరణాల దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
ఈ సందర్భంగా సాంగ్వి గ్రామంలో పర్యటించిన ఎస్పీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి తీరాన్ని సందర్శించి భక్తుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామస్తులు గోదావరి తీరంలో ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తులు పోలీసులకు సహకరిస్తూ అమ్మవారి ఆభరణాలను దర్శించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వీడీసీ ఆధ్వర్యంలో ఎస్పీ జానకి షర్మిలతో పాటు అదనపు ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణలను సన్మానించారు.