అన్నదాతలకు ఊరట..!

13-10-2026 | 05:05am
  1. మద్దతుకు మించి పంటలకు ధరలు
  2. దిగుబడి తగ్గినా.. పెరిగిన ధరలు

మహబూబాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఎల్ నినో(El Niño) నేపథ్యంలో వానాకాలం పంటల సాగు(Crop Cultivation) విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల(Rainy weather conditions) నేపథ్యంలో పంటలు దిగుబడి కూడా ఆశించిన మేర రావడం లేదు. అయితే వానాకాలంలో సాగుచేసిన కొన్ని పంటల ఉత్పత్తులు ఇప్పుడిప్పుడే చేతి కందుతున్న దశలో ఉన్నాయి. ఆయా పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మించి ప్రైవేటు వ్యాపారులు మద్దతు కు మించి ధర పెడుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

దిగుబడి తగ్గినా చేతికి అందిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతులకు కాస్త ఊరటగా మారింది. పంట విస్తీర్ణం భారీగా తగ్గిన వరి, పత్తి సాగులో(Paddy and cotton cultivation) పెరిగిన ధర కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుండగా, ఎల్‌నినో ప్రభావం తో తగ్గించిన వరి, పత్తి పంటల సాగుకు బ దులుగా తక్కువ నీటి వినియోగం కలిగిన ఇ తర పంటలను సాగు చేశారు. పెసర, కందు లు, బొబ్బర్లు, మక్కలు, వేరుశనగ కొంతమే ర సాగు చేయగా ఆ పంటలకు కూడా మద్దతుకు మించి ధర లభిస్తుందడంతో రైతులకు చాలా వరకు దన్నుగా నిలుస్తున్నాయి. 

రోజురోజుకు పెరుగుతున్న ధరలు

ఈ వానాకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పంటలను ఉత్పత్తులకు మద్దతు మించి ధర లభించడంతోపాటు పంటల ఉత్పత్తుల ధరలు రోజురోజుకు పెరుగుతుండడం విశేషంగా మారింది. పత్తి, వేరుశనగ, నువ్వులు, ధాన్యం, బొబ్బర్లు, కందులు, పెసర్లు, మినుములు తదితర పంటలకు రికార్డు స్థాయిలో ధర లభిస్తోంది. 

తెల్ల బంగారంగా పత్తి పంట!

రైతులు సాగుచేసిన పత్తి పంట ‘తెల్ల బంగారం’గా మారి సిరులు కురిపిస్తుంది. ప్రభుత్వం పత్తి పంటకు గరిష్టంగా క్వింటాలుకు 8,111 రూపాయల ధర నిర్ణయించగా, ప్రస్తుతం 9 వేలకు పైగా చేరింది. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్లో క్వింటాలుకు 9,120 రూపాయల ధర లభించగా, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో 9,111, వరంగల్ ఏనుమాముల మార్కెట్లో 9,060 రూపాయల ధర లభించింది.

ఇక ధాన్యానికి గరిష్టంగా 4,600 ధర లభించగా, కందులకు 10వేల పైచిలుకు, పెసర్లకు 8,600 పైచిలుకు ధర పలికింది. ఇక నువ్వులకు 12,000 పైసలుకు ధర లభించగా, మక్కజొన్నలకు 2,600 పైచిలుకు ధర లభిస్తోంది. వేరుశనగ పంటకు 9,000 రూపాయల ధర లభించింది. అలాగే గత సంవత్సరం సాగుచేసిన పంట ఉత్పత్తులకు కూడా ఇప్పుడు మంచి ధర లభిస్తుంది. కొందరు రైతులు నిలువ చేసి విక్రయిస్తున్న మిర్చి, పసుపు పంటలకు కూడా మద్దతుకు మించి ధర లభిస్తుంది.

మరిన్ని వార్తలు