7 September, 2026 | 6:07 AM

ఆటో డ్రైవర్‌గా సత్యవతి రాథోడ్

07-09-2026 | 05:05am

ఆటోడ్రైవర్ లకు మద్దతుగా నిరసన ర్యాలీ 

ప్రభుత్వం ఆటోడ్రైవర్‌లకు 

న్యాయం చేయాలని డిమాండ్

మహబూబాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా చేపట్టిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) ఆటో డ్రైవర్ గా మారి ఆటోను నడిపారు. ఈ సందర్భంగా బొడ్రాయికి మొక్కి, ఆటో డ్రైవర్ల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్దిమారాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు బహిరంగ వేదికలపై మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారని హితవు పలికారు. చెప్పుకోవడానికి నువ్వు చేసిన పనులు ఏమిలేవు,  అందుకే కేసిఆర్ కుటుంబాన్ని తిడుతూ కాలం గడుపుతూ, అదే పాలన అనుకుంటున్నావని సీ ఎం రేవంత్ రెడ్డి పై రేవంత్ రెడ్డి పై ఆమె మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తెలంగాణ ప్రజలకు శాపంలా మారిందన్నారు. ఓటుకు నోటు దొంగవు, నువ్వు నీతులు చెపితే వినాల్సిన దౌర్భాగ్యం మాకు పట్టిందన్నారు..నువ్వు, నీ.. సోదరులు, నీ మంత్రివర్గ అనుచరులు లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబేట్టుకుంటున్నారు, కానీ నీ..పాలనలో అన్ని వర్గాల ప్రజలు మాత్రం రాష్ట్రంలో అరిగోస పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కూలిపోవడం ఖాయమని ఆమె శపించారు. ఆటోడ్రైవర్ లు దైర్యంగా ఉండాలని, మీ వెంట బిఆర్‌ఎస్ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లాపరిషత్ మాజీ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు, బిఆర్‌ఎస్ నాయకులు, ఆటోడ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు