ఆగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త..
రేపటి నుంచి బాండ్ల ధృవీకరణ
ఐదు జిల్లాల బాధితులకు మహబూబ్నగర్లో ప్రత్యేక కేంద్రం..
193 రోజుల పాటు మండలాల వారీగా పరిశీలన
ఎస్పీ డి జానకి
మహబూబ్నగర్ క్రైమ్, నవంబర్ 24: ఆగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ డి జానకి(SP D Janaki) తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆగ్రిగోల్డ్ అసలు బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట ఐదు జిల్లాల బాధితులకు మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయం ఎదురుగా ఉన్న సీఐడీ భవనంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
మండలాల వారీగా 193 రోజుల పాటు ధృవీకరణ చేపట్టనుండగా, రోజుకు గరిష్ఠంగా 250 మంది బాధితులకు అవకాశం కల్పించనున్నారు. బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీల్లో అసలు బాండ్లు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్లు, ఫొటో తదితర పత్రాలతో హాజరుకావాలి. డిపాజిటర్ మరణించినట్లయితే నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధృవీకరణ పత్రంతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలి. అసలు బాండ్లను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని, పరిశీలన కోసం మాత్రమే చూపించాలని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. నిర్ణీత తేదీల్లోనే బాధితులు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జి.రవిబాబు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ – 8712659306. ధృవీకరణ పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు.