రేవంత్ పోవాలి... కేసీఆర్ రావాలి
- తరాల చరిత్ర కేసీఆర్ ది...మోసాల చరిత్ర రేవంత్ రెడ్డి ది
- భారాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి
- మానకొండూరు లో సభాస్థలి పరిశీలన
మానకొండూరు నవంబర్ 24 (విజయక్రాంతి): రేవంత్ పోవాలి... కేసీఆర్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి పార్టీ (Bharat Rashtra Samithi Party) రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముక్తకంఠంతో భారాసకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల నినాదమన్నారు.
తరాల చరిత్ర కేసీఆర్ ది మోసాల చరిత్ర రేవంత్ రెడ్డి ది అని విమర్శించారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా రాష్ట్రానికి పట్టిన శని రేవంత్ రెడ్డి అని తీవ్ర విమర్శలు చేశారు. అధికార మార్పు మంచి కోసమని ప్రజలు ఆశించారని, కానీ అసలుకే ఎసరు వచ్చిందన్న విషయం ప్రజలు గ్రహించారని అన్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లులను కేటాయించక గన్ని బ్యాగులకు సైతం తీవ్ర కొరత ఉందని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, రైతు బీమా, మద్దతు ధర ,గౌడ ,చేనేత కార్మికులకు పెన్షన్లు పంపిణీ చేసి ఆ వర్గాలకు అండదండలు అందించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
గొల్ల, కురుమ, వర్గాలకు ఒక లక్ష 25 వేల రూపాయలతో గొర్రెలను పంపిణీ చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన దార్శనీకుడు కేసీఆర్ అని కొనియాడారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానియంగా ఉందని,
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయలు కొట్టడానికే సరిపోయాయని ఎద్దేవ చేశారు. సిరిసిల్ల, సిద్దిపేటలో బహిరంగ సభలు జరిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.
దీక్ష దివస్ సభను విజయవంతం చేయాలి
చారిత్రాత్మకమైన ఘట్టానికి అంకురార్పణ జరిగిన అలుగునూరులో నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ స్ఫూర్తి సభను స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని భారాస పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం 40 ఎకరాల స్థలంలో సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు.
మంగళవారం మానకొండూరు లోని సమావేశ స్థలాన్ని ,సభ నమూనా పటాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వాక అధ్యక్షులు కేటీఆర్ హాజరవుతారని చెప్పారు. సభా స్థలి పరిశీలన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ,
కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు శేఖర్ గౌడ్, రమేష్, నాయకులు శాతరాజు యాదగిరి, తదితరులతో కలిసి సమావేశ స్థలాన్ని పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడారు.సుమారు లక్ష మందితో చరిత్రలో నిలిచిపోయే విధంగా సభను నిర్వహిస్తామన్నారు.