బీసీల హక్కుల కోసం అక్షర సమరం
జడ్చర్ల, నవంబర్ 05 (విజయక్రాంతి): జడ్చర్ల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ రచించిన “బీసీల హక్కుల సాధనకై అక్షర పోరాటం” పుస్తకాన్ని బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. జడ్చర్లకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా (Print and Electronic Media) విలేకరుల బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, సురేందర్ మాట్లాడుతూ.. బీసీ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను అక్షర రూపంలో ప్రజల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. బీసీల హక్కుల సాధన కోసం సాగుతున్న ఉద్యమాలకు ఇటువంటి పుస్తకాలు (Social Awareness Books) దిశానిర్దేశం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
బీసీలకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులు, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం, విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఐక్యత, హక్కుల సాధన, సామాజిక న్యాయం లక్ష్యంగా రచించిన ఈ పుస్తకం యువతలో చైతన్యం (Social Awareness) పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమాజంలో అణగారిన వర్గాల గొంతుకగా అక్షర పోరాటం కొనసాగాలని, రచయిత బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మరిన్ని ప్రజా సమస్యలపై రచనలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్లకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులతో పాటు బీసీ జాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి రఘునందన చారి, మండల అధ్యక్షుడు గొడుగు నరసింహులు, సురభి విజయకుమార్, శివశంకర్, లింగంపేట శేఖర్, గోపాల్, చెన్నయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.