యాసంగిలో వరి వద్దు.. కూరగాయలే ముద్దు!
పెద్దపల్లి, నవంబర్ 05 (విజయక్రాంతి): జిల్లాలో రానున్న యాసంగి 2026–27 సీజన్లో ఎల్నినో ప్రభావం (El Niño Effect) కారణంగా వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని జిల్లా ఉద్యానవన అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు (Paddy Cultivation) దూరంగా ఉండాలని, తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల నుంచి వ్యవసాయ అవసరాలకు నీటి సరఫరా పరిమితంగా ఉండే అవకాశం ఉందని, తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితులు రావచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు భూములను బీడుగా ఉంచడం లేదా తక్కువ నీటి అవసరమయ్యే కూరగాయల పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేసుకోవాలని కోరారు.
రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ (Horticulture Department) ఆధ్వర్యంలో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కూరగాయల విత్తన కిట్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కో కిట్లో ఏడు రకాల కూరగాయల విత్తనాలు ఉంటాయని, ఇవి 10 గుంటల విస్తీర్ణంలో సాగుకు సరిపోతాయని వివరించారు. ఒక్కో కిట్ విలువ సుమారు రూ.1,000 ఉంటుందని తెలిపారు.
ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ వివరాలను సంబంధిత మండల ఉద్యానవన అధికారులు లేదా ఉద్యానవన విస్తరణ అధికారులకు అందజేయాలని జిల్లా ఉద్యానవన అధికారి సూచించారు.