తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె

05-11-2026 | 10:21am

తండ్రికి అంతిమ వీడ్కోలు పలికిన కూతురు.. కంటతడి పెట్టించిన ఘటన

చేగుంట, నవంబర్ 5 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రి మృత్యువాత పడటంతో ఇద్దరు కుమార్తెలు, వృద్ధ తల్లి దిక్కుతోచని స్థితిలో మిగిలారు. తండ్రి అంత్యక్రియల్లో పెద్ద కుమార్తె తలకొరివి పెట్టిన దృశ్యం అక్కడికి వచ్చిన వారందరినీ కంటతడి పెట్టించింది. చేగుంట మండల కేంద్రానికి చెందిన నరసింహాచారి (48) వృత్తిరీత్యా RMP Doctor. కుటుంబ పోషణ కోసం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న ఓ Private Hospitalలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ తన సొంత వాహనంపై చేగుంట నుంచి హైదరాబాద్‌కు వెళ్లి విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7 గంటలకు విధులకు బయలుదేరిన ఆయనకు తూప్రాన్‌–నాగులపల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కంటైనర్ లారీ వెనుక నుంచి ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై నరసింహాచారి అక్కడికక్కడే మృతిచెందారు.

నరసింహాచారికి రక్షిత, అక్షర అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం చేగుంటలో నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్ద కుమార్తె రక్షిత తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ దృశ్యం చూసిన బంధువులు, గ్రామస్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో మరోవైపు 75 ఏళ్ల వృద్ధ తల్లి లక్ష్మి ఉన్నారు. అనారోగ్యం, వైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న ఆమె తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న గదితో కూడిన ఇల్లు తప్ప కుటుంబానికి మరో ఆస్తి లేదు. ఇప్పటివరకు కుటుంబం మొత్తం నరసింహాచారి సంపాదనపైనే ఆధారపడి జీవించింది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతితో ఇద్దరు కుమార్తెల చదువులు, భవిష్యత్తు, వివాహాల బాధ్యత ప్రశ్నార్థకంగా మారింది. వృద్ధ తల్లి సంరక్షణ కూడా భారంగా మారనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి Financial Support అందించాలని బంధువులు, మిత్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా పిల్లల Education, భవిష్యత్తు అవసరాలు, వివాహాలకు ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు