కారు ర్యాష్ డ్రైవింగ్ తో దంపతులు మృతి
అనాధలుగా మారిన ముగ్గురు పిల్లలు
భూత్పూర్, అక్టోబర్ 17 : కారు ర్యాష్ డ్రైవింగ్(Rash driving of a car)తో దంపతులు మృతి చెందిన సంఘటన భూత్పూర్ పట్టణంలోని(Bhoothpur town) అమిస్తాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగన్న తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమిస్తాపూర్ గ్రామానికి చెందిన టైలర్ షాకీర్ (45), ఆయన భార్య సహనా బేగం (40), కుమార్తె ఆయారా తో కలిసి శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మహబూబ్నగర్లో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తున్నారు. అమిస్తాపూర్ గ్రామంలోని యుపిఎస్ పాఠశాల సమీపంలో మలుపు వద్ద అతివేగంగా వస్తున్న టీజీ 34 బి 7235 అనే మహేంద్ర తార్ టీఎస్ 06 ఈ ఎక్స్ 3136 అనే బైక్ను వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న సహనా బేగం అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ ను నడుపుతున్న టైలర్ సాకీర్ కు తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. మూడేళ్ల కుమార్తె ఆయరా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్యాభర్తలు మృతి చెందడంతో అమిస్తాపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. దంపతులు మృతి తో ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.