విద్యుత్ కోతపై బీఆర్ఎస్ ఆగ్రహం

17-10-2026 | 09:32pm

నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గల మద్నూర్(Madnoor) మండలంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించి రైతులకు, గృహ వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సమరభేరి మోగించింది. రాష్ట్రంలో నిత్యం విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగంపై విద్యుత్ సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్(Electricity) అందించామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ సరఫరాపై అనిశ్చితి నెలకొందని నాయకులు విమర్శించారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తమ వ్యవసాయ పనులను సకాలంలో నిర్వహించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలకు అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామని ప్రకటించడం కంటే, సమస్యకు అసలు కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ముందుచూపు లేని విధానాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సి పటేల్ ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల వల్ల వ్యవసాయ మోటార్లు దెబ్బతింటున్నాయని, పంటలకు అవసరమైన సమయంలో నీరు అందక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రైతులు సబ్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో, వరి సాగు చేయవద్దంటూ ప్రభుత్వం సూచనలు చేయడం రైతులకు ఇబ్బందికరంగా మారిందని విమర్శించారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తక్షణమే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని బన్సి పటేల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, భారీ ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పండిత్ రావు పటేల్, మండల మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారస్ సురేష్, చిన్న శక్కర్గ మాజీ సర్పంచ్ గఫార్, శాఖాపూర్ మాజీ సర్పంచ్, మండల యువ నాయకుడు వాగ్మరే మారుతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు