డ్రోన్‌తో తప్పిపోయిన వ్యక్తి గుర్తింపు
కోయిలకొండ,(విజయక్రాంతి):అడవిలో తప్పిపోయిన వ్యక్తిని డ్రోన్ కెమెరాల సహాయంతో గుర్తించి మహబూబ్‌నగర్ పోలీసులు(Mahabubnagar Police) సురక్షితంగా రక్షించారు. కోయిలకొండ మండలం ఆచార్యపూర్‌కు చెందిన జాజలి కృష్ణయ్య ఈ నెల 8న మేకలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు, ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో(drone cameras) గాలించగా కొండ చరియల మధ్య లోయలో కృష్ణయ్య చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండు రోజులుగా వెంట తీసుకెళ్లిన నీటితోనే కృష్ణయ్య అక్కడ ప్రాణాలు కాపాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్లను ఎస్పీ అభినందించారు.