విద్యార్థుల కోసం రోడ్డు వేస్తే తప్పేంటి?
జడ్చర్ల, నవంబర్ 10 (విజయక్రాంతి): జడ్చర్ల పట్టణంలోని డా.బి.ఆర్.ఆర్. డిగ్రీ కళాశాలకు వెళ్లే రహదారి మరమ్మతులు చేపడితే తప్పేంటని స్వచ్ఛంద సామాజిక కార్యకర్త జర్పుల భాస్కర్ నాయక్ ప్రశ్నించారు. కళాశాల ప్రిన్సిపల్ విజ్ఞప్తి మేరకే విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. 167వ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టలేదని స్పష్టం చేశారు.
సోమవారం జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాల రహదారి మరమ్మతులపై ఓ పత్రికలో వచ్చిన కథనానికి వివరణ ఇచ్చారు. రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రయాణ సమయంలో కిందపడి గాయపడిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రహదారికి మరమ్మతులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్న యువతను రాజకీయాలకు దూరం చేసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
జడ్చర్ల నియోజకవర్గంలోని పలు విద్యాసంస్థలు సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. జడ్చర్ల డిగ్రీ కళాశాలలో మినరల్ వాటర్ (Mineral Water) సదుపాయం లేదని, రాజాపూర్ కస్తూర్బా పాఠశాలలో తాగునీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని తాము సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భాస్కర్ నాయక్ తెలిపారు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి పేరును రాజకీయ వివాదాల్లోకి లాగి చెడ్డపేరు తీసుకురావడం ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వాటిపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆలయానికి వెళ్లి పసుపు నీళ్లతో ప్రమాణం చేసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆలయాల నిర్మాణాలకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదని ఆరోపించారు.
ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు రంగారెడ్డి గూడలో తన తాత పేరుపై ఉన్న 50 ఎకరాల భూమిని ఇస్తానని దేవుడిపై ప్రమాణం చేసి హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఎమ్మెల్యే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము చేసిన తప్పును నిరూపిస్తే బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని భాస్కర్ నాయక్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలని, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేవారిని ప్రోత్సహించాల్సింది పోయి విమర్శించడం తగదని హితవు పలికారు. ఎమ్మెల్యేకు తెలిసే ఈ వార్త ప్రచురితమైందని ఆయన ఆరోపించారు.