పేదల ఇంట్లో పండుగ వెలుగులు
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’తో పేదల కళ్లలో ఆనందం
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ పరమావధి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, భూపాలపల్లి, నవంబర్ 09(విజయక్రాంతి): అధికార దర్పం లేదు.. ప్రొటోకాల్ ఆర్భాటం అంతకన్నా లేదు.. సాక్షాత్తూ రాష్ట్ర క్యాబినెట్ సీనియర్ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు కలిసి ఓ నిరుపేద ఇంట్లో చాపపై కూర్చుని, ప్రభుత్వం ఇచ్చిన ఉచిత సన్నబియ్యం అన్నాన్ని ఎంతో తృప్తిగా ఆరగించారు. పేదల కష్టసుఖాలు తెలుసుకుంటూ, వారి ఇంట్లోనే దీపావళి కాంతులు నింపిన ఈ అపురూప దృశ్యం స్థానికుల హృదయాలను హత్తుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ, మేడిపల్లి గ్రామాల్లో నిర్వహించిన (మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి) కార్యక్రమం ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వయంగా లబ్ధిదారులైన ఏపూరి పుష్పలత, గుండ్ల రమల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పేదవాడి కంచంలో సన్న టి చిరునవ్వు
మేడిపల్లిలో లబ్ధిదారురాలు గుండ్ల రమ నివాసానికి వెళ్లిన మంత్రి శ్రీధర్ బాబు.. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్లతో కలిసి వారితో పాటే కింద కూర్చున్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో వండిన భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి భావోద్వేగంగా మాట్లాడుతూ.... పేదరికం అనేది ఆహారంలో కనిపించకూడదు. సంపన్నులు తినే నాణ్యమైన సన్నబియ్యం భోజనం ప్రతి పేదవాడి ఇంట్లోనూ ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం. పేదల సంక్షేమమే మా ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.
బాణసంచా వెలుగుల్లో సామాన్యుడితో కలిసి సంబరాలు
భోజనానంతరం లబ్ధిదారుల కుటుంబసభ్యులు, చిన్నారులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. తమ ఇంటికి రాష్ట్ర మంత్రి, జిల్లా ఉన్నతాధికారులు వచ్చి తమతో కలిసి పండుగ చేసుకోవడంపై లబ్ధిదారులు ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.