భాగ్యలక్ష్మి అమ్మవారి నాణేల పంపిణీ
- చార్మినార్‌కు పోటెత్తిన జనం
- గుల్జార్ హౌస్ వరకు భక్తుల బారులు
- నాలుగు క్యూలైన్ల ఏర్పాటు
- ఈ నెల 11 వరకు నాణేల పంపిణీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయా(Bhagyalakshmi Temple)నికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మ వారి ఖజానా నుంచి పవిత్ర నాణేల పంపిణీ ఆదివారం సాయంత్రం ప్రారంభం కావడంతో, నాణేలను స్వీకరించేందుకు నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర నలు మూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రద్దీ తీవ్రమవ్వడంతో ఆలయ ప్రాంగణం నుంచి క్యూలైన్లు గుల్జార్ హౌస్ వరకు విస్తరించాయి. రద్దీని క్రమబద్ధీకరించేందుకు, భక్తులకు ఎలాం టి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా నాలుగు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఖజానా నుంచి లభించే నాణేన్ని తమ పూజా మందిరాల్లో ఉంచుకుంటే ఇంట శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తుల దృఢమైన విశ్వాసం. ఈ నమ్మకంతోనే ఏటా దీపావళి సమయంలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నెల 11 వరకు నాణేల పంపిణీ కొనసాగనుంది.