కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

10-11-2026 | 05:35am
  1. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు..
  2. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం
  3. అభివృద్ధి పనుల్లో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

కరీంనగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అభివృద్ధిలో కాదని నిరూపించారు కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar), పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar)లు. నగరంలో పలు అభివృద్ధి పనులకు వారిరువురు శ్రీకారం చుట్టారు. నగరంలోని రాంనగర్ డివిజన్‌లో రూ.1.5 కోట్ల వ్యయంతో రూపొందించిన బాక్స్ టైప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే తపనతో అహర్నిశలు కష్టపడు తుంటే కొంత మంది తమ కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా కేంద్రం అనేక పనులకు నిధులు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం మ్యా చింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో ఆ నిధులన్నీ మురిగిపోయి అభివృద్ధి ఆగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత కాలంలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించలేకపోయిందన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు అమృత్ స్కీం కింద రూ.17 కోట్లు, యూసీఎఫ్ స్కీంలో భాగంగా 80 కోట్ల నిధులతో పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు. 17 కోట్లతో టెండర్ పనులను ప్రారంభిస్తే లేనిపోని వివాదాలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రజలతోపాటు అభివృద్ధిని కాంక్షించే వాళ్లంతా వాస్తవాలు గ్రహించా లని, చిల్లర వేషగాళ్ల ట్రాపులో పడొద్దని కోరారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతామన్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జలసంపదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఎలగందుల, ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

కరీంనగర్ నగరంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అర్బ న్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఆ బాధ్యతను నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు