కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు
- కేసీఆర్‌పై కక్షతో రైతులకు అన్యాయం..
- కాళేశ్వరం నీళ్లు ఎత్తకుండా కిందికి వదిలేశారు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి(MLA D. Sudheer Reddy), మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ పంపింగ్ చేయకుండా దిగువకు వదిలేశారని, కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే నీటిని వినియోగించలేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించినప్పుడు నీటి ప్రవాహం ఉందని, నీటిని ఎత్తిపోసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. 80 నుంచి 120 రోజులపాటు నీటిని ఎత్తుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. దేవాదుల, సీతారామ, పట్టిసీమ ప్రాజెక్టుల్లో బ్యారేజీలు లేకుండానే మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారని గుర్తుచేశారు. కాళేశ్వరం తెలంగాణ జీవనాడి అని, వేసవిలో నీటి అవసరాలకు బ్యారేజీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన భాషను మార్చుకోవాలని సుధీర్‌రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఎస్టీపీలతో గ్రీన్ వాటర్ సరఫరా జరుగుతోందని, మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఎలా ఉందో, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారని, కాలిపోయిన మోటార్లతో అసెంబ్లీ ఎదుట నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో రేవంత్‌రెడ్డి కూడా రైతుల ధర్నాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఐదు, ఆరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.