కలిసి పనిచేద్దాం: మంత్రి పొన్నం
ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యం
ముకరంపుర, నవంబర్ 9 (విజయక్రాంతి): ఎన్నికల వరకు రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్లో యూఐడీఎఫ్ నిధులు రూ.1.5 కోట్లతో చేపట్టనున్న బాక్స్ టైప్ డ్రెయిన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌తో కలిసి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం వరకు పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా భీమదేవరపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. జమ్మికుంట, హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వైద్యరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జల సంపదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు(Karimnagar district) అభివృద్ధిలో అపార అవకాశాలు ఉన్నాయని పొన్నం పేర్కొన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎలగందుల ఖిల్లాతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు వెళ్తామని చెప్పారు. కరీంనగర్ నగరంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా Urban Developmentకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం దాదాపు 1,000 కొత్త పోస్టులకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తాం
కరీంనగర్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల(Double-bedroom houses) నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్లు పొన్నం తెలిపారు. ప్రజాప్రతినిధిగా జిల్లా అభివృద్ధికి కృషి చేయడం తమ బాధ్యతని, ప్రజల ఆశీర్వాదంతో ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.