విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు

16-10-2026 | 07:04pm

మహాదేవపూర్,అక్టోబర్ 16.(విజయక్రాంతి ): మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్యప్రాణులను వేటాడేందుకు అడవుల్లో విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మహాదేవపూర్ ఎస్సై సాంబమూర్తి(Mahadevpur SI Sambamurthy) అన్నారు. గతంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన నలుగురు వ్యక్తులను ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు.

అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని అందువల్ల వన్యాప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడితే వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

మండలంలోని గ్రామాల పరిసరాలల్లో అటవీ ప్రాంతాల్లో అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 8712658116 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రజలు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు