పర్యావరణ హిత మట్టి గణేశ విగ్రహాల తయారీపై కార్యశాల
మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (Government Women's Degree College)లో ఎకో క్లబ్, వృక్షశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి గణేశ విగ్రహాల(clay ganesha idols) తయారీపై శుక్రవారం కార్యశాల, పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్, ఎకో క్లబ్ కన్వీనర్ అమీనా ముంతాజ్ జహాన్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ పదార్థాలతో మట్టి గణేశ విగ్రహాలను తయారు చేయడం పర్యావరణ పరిరక్షణ(Environmental protection)కు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.
విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని బంకమట్టితో గణేశ విగ్రహాలను తయారు చేశారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో విజేతలకు మొదటి, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్ బహుమతులను ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పద్మావతి అందజేశారు. విద్యార్థినులు తయారు చేసిన 70కి పైగా మట్టి గణేశ విగ్రహాలను కళాశాల పరిసరాల్లోని కాలనీవాసులు, దుకాణదారులకు ఉచితంగా పంపిణీ చేశారు.