ఉచితంగా ఇసుకను తరలించుకునేందుకు అనుమతులు ఇవ్వాలి..
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial district) చెన్నూర్ నియోజకవర్గంలో స్థానికంగా లభించే ఇసుకను స్థానిక ప్రజల అవసరాలకు వాడుకునేందుకు ఉచితంగా తరలించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధికార ప్రతినిధి గర్రెపల్లి వెంకట నర్సయ్య డిమాండ్ చేశారు. చెన్నూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చెన్నూర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూర్ పట్టణ తలాపున ఉత్తర వాహిని గోదావరి నది ఉన్న ఇసుక కోసం గ్రామీణ,పట్టణ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోదావరి నది నుండి పట్టణ,గ్రామీణ ప్రాంత వాసులకు ఇంటి నిర్మాణాలకై ఉచితంగా ఇసుకను తీసుకోవాలని స్పష్టమైన జీవోలు వున్నా వాటిని తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రాంతాలకు ఇసుకను అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.గతంలో గోదావరి నది నుండి సింగరేణికి ఇసుకను తరలించవద్దని పట్టణ వాసులు అడ్డుకున్న ఘటనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాఖలో అక్రమ ఇసుక రవాణా సాగుతోందని,అనేక మార్లు పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు.. మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించి నియోజకవర్గ వాసులకు ఉచితంగా ఇసుక వినియోగించుకోకుండ ఉన్న ఆంక్షలు ఎత్తి వేయించాలని ,లేనట్లయితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో మహిళా మోర్చ జిల్లా ట్రెజరర్ ముత్యాల శ్రావణి,కొండపాక చారీ,మానిక్ రౌతు శంకర్, గడ్డం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.