Breaking News

ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుపై ఛార్జ్ షీట్

09-09-2026 | 06:10pm

- ఎన్నికల హామీల అమలులో విఫలం

- ప్రజలకు సమాధానం చెప్పాలి

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల నియోజక వర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు(MLA Kokkirala Premsagar Rao) వెయ్యి రోజుల పాలనపై బీజేపీ నాయకులు ఛార్జ్ షీట్(charge sheet) విడుదల చేశారు. బుధవారం జిల్లా బీజేపీ(Bharatiya Janata Party) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ ఎంఎల్ఏ పీఎస్ఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వివరించారు, వెయ్యి రోజుల పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం సరికాదని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఆండాలమ్మ కాలనీ నుంచి డంప్‌యార్డును తొలగించి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ డంప్‌యార్డు అక్కడే ఉందన్నారు. దీంతో ఆండాలమ్మ కాలనీ, గ్రీన్‌సిటీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు 90 రోజుల్లో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి వెయ్యి రోజులు పూర్తయినా మంచిర్యాల నియోజకవర్గంలోని బాధితులకు పరిహారం అందలేదని విమర్శించారు. మంచిర్యాల నుంచి లక్ష్మీ థియేటర్ వరకు, అక్కడి నుంచి రాజీవ్‌నగర్‌ వైపు ఫ్లైఓవర్‌ పనులను ఆరు నెలల్లో ప్రారంభిస్తామని చెప్పినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. గోదావరి నదిపై రూ.165 కోట్లతో ప్రతిపాదించిన వంతెనను రద్దు చేయడం వల్ల మంచిర్యాల నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌, హైదరాబాద్‌ వెళ్లే ప్రజలకు ప్రయాణ దూరం తగ్గే అవకాశం కోల్పోయారన్నారు. వంతెన నిర్మాణాన్ని కొనసాగించకుండా రద్దు చేయడంపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రైతులు, సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రశ్నలు

రైతులకు ధాన్యం కొనుగోళ్లలో కటింగ్‌ ఉండదని హామీ ఇచ్చినా ప్రస్తుతం ఒక్కో బస్తాకు మూడు, నాలుగు కిలోల వరకు, క్వింటాల్‌కు పది కిలోల వరకు కటింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. సాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేదని, కొత్త లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలను ప్రారంభిస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు. సింగరేణి కార్మికులకు పట్టాల సమస్యను పరిష్కరిస్తామని, రిటైర్డ్‌ కార్మికులకు రెండు గుంటల భూమి ఇస్తామని ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని విమర్శించారు. కరకట్ట నిర్మాణం పనులు ప్రారంభమై తిరిగి నిలిచిపోయాయని, వంద అడుగుల రోడ్డు పనులు కూడా పూర్తి కాలేదన్నారు.

రౌడీయిజం సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు

మంచిర్యాలలో గతంలో లేని రౌడీయిజం, గూండాయిజం సంస్కృతిని తీసుకువచ్చారని ఆరోపించారు. ఇటీవల ఎమ్మెల్యే స్వయంగా ‘గంజాయి బ్యాచ్‌’ అనే పదాన్ని ఉపయోగించారని, ఆ బ్యాచ్‌ను ప్రోత్సహించింది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. యువత గంజాయికి బానిసలవుతున్నా అరికట్టేందుకు ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

వ్యాపారులు, వైద్యులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను బెదిరించేందుకు కొంతమంది వ్యక్తులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు చేశారు. కొంతమంది వ్యక్తులు సెటిల్‌మెంట్ల పేరుతో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను బీజేపీ సహించదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై మాత్రం ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

రూ.470 కోట్ల అప్పు చెల్లింపుపైనా ఆరోపణలు

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 15 నెలల్లో రూ.470 కోట్ల అప్పు చెల్లించారని పేర్కొంటూ, ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. స్మశాన వాటిక, మహాప్రస్థానం, ఎల్లంపల్లి–వేమ్‌పల్లి ప్రాంతంలోని ఐటీ పార్క్‌, గోదావరి వంతెన తదితర అభివృద్ధి పనుల విషయంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కాంట్రాక్టర్లను టెండర్లు వేయకుండా బెదిరించడం, అనంతరం రీ-టెండర్‌ నిర్వహించి అదనపు శాతంతో పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు చేశారు. వర్క్‌ ఆర్డర్‌ రాకముందే కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు