భీంగల్ పోలీస్ స్టేషన్‌లో టీ వ్యాపారి ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులే కారణమంటూ బాధిత కుటుంబం, అఖిలపక్షాల ఆరోపణలు
ఆరోపణలను ఖండించిన పోలీసులు.. ఘటనకు మరో వ్యాపారితో వివాదమే కారణమని వెల్లడి
ఆర్మూర్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ పోలీస్ స్టేషన్‌లో(Bheemgal Police Station) టీ వ్యాపారి పొలాస సుధాకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపుల కారణంగానే సుధాకర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆయన కుటుంబ సభ్యులు, అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేసింది.
భీంగల్ బస్టాండ్ సమీపంలో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న సుధాకర్‌ను రాత్రి వేళల్లో టీ విక్రయిస్తున్నాడనే కారణంతో పోలీసులు పలుమార్లు ఇబ్బందులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పెట్టీ కేసులు, జరిమానాలు విధించారని, తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తెలిపారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో పెట్రోల్‌తో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుధాకర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న పోలీసులు, ఇతరులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అఖిలపక్షాల ఆందోళన
ఘటన అనంతరం సుధాకర్ కుటుంబ సభ్యులు భీంగల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు వారికి మద్దతు తెలిపారు. బాధితుడిపై ఒత్తిడి తీసుకువచ్చి స్టేట్‌మెంట్‌ను మార్చేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఎస్సైపై చర్యలు తీసుకోవాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి
బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. పేద టీ వ్యాపారి సుధాకర్ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. బాధితుడికి ప్రభుత్వం తరఫున ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
భీంగల్ ఎస్సై తిరుపతిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయని, సామాన్యులను వేధిస్తున్నారంటూ విమర్శించారు. సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సైపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల వివరణ
అయితే పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. సుధాకర్‌కు మరో వ్యక్తితో ఉన్న వివాదం, అతని టీ స్టాల్‌లో రాత్రి వేళల్లో వ్యాపారం నిర్వహించడం తదితర అంశాలపై పోలీసులు పెట్టీ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆ కేసులో రిమాండ్‌కు వెళ్లి బెయిల్‌పై వచ్చిన సుధాకర్, అదే విషయాన్ని మనసులో పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో పోలీసు వ్యవస్థకు లేదా పోలీసు సిబ్బందికి ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.