బెటాలియన్‌లో ప్రత్యేక పోలీస్ డీఐజీ తనిఖీలు
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ బెటాలియన్‌ను గురువారం తెలంగాణ ప్రత్యేక పోలీస్(Telangana Special Police) (టీజీఎస్పీ) విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)(Deputy Inspector General of Police) మురళీకృష్ణ తనిఖీ చేశారు. మూడు రోజుల వార్షిక తనిఖీల్లో భాగంగా బెటాలియన్‌కు చేరుకున్న డీఐజీ మురళీకృష్ణ తొలిరోజు కమాండెంట్ వెంకటేశ్వర్లు తో కలిసి బెటాలియన్ పరిసర ప్రాంతాలను,
పరిపాలనా విభాగాలు, క్వార్టర్స్, ఇతర మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బెటాలియన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక బలగాల పాత్ర అత్యంత కీలకమని, అధికారులు, జవాన్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఉన్నతమైన క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట...
బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది జీవన స్థితిగతులు, క్షేత్రస్థాయి సమస్యలను డీఐజీ మురళీకృష్ణ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, శిక్షణతో పాటు వారి ఆరోగ్యం, నివాస వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు వీరరాజు, ఆంజనేయ రెడ్డి, నాగభూషణం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) గౌస్ మోహియోద్దీన్‌లతో పాటు బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.