పత్తి సాగు వైపు రైతులు మొగ్గు

22-09-2026 | 06:52pm
  1. మద్దతు ధర పెరగుదలతో ఆసక్తి...
  2. వరిని మించి సాగైన పత్తి 

భీమిని, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా భీమిని మండల రైతాంగం (Farming community)ఈ ఏడాది వర్షాధారంగా సాగయ్యే పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. మండలంలో పత్తి పంట సాగుకు అనువైన నేలలు, అనుకూలమైన వాతావరణం,  అందుబాటులో మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో రైతులు పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. నీటి వినియోగం తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా  పత్తికి  మద్దతు ధర పెంచుతుండడం, ప్రభుత్వ మద్దతు ధర ఈ ఏడాది ఎక్కువగా ఉండడం, ప్రైవేటు వ్యాపారులు సైతం గత ఏడాది ఎక్కువ డబ్బులు చెల్లించి పత్తిని కొనుగోలు చేయడంతో ఈ ఏడాది పత్తి సాగు చేసేందుకే రైతులు ఇష్టపడుతున్నారు. 

పెరిగిన మద్దతు ధర...

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి పంట మద్దతు ధర పెంచింది. గత ఏడాది కింటాలుకు రూ. 8,110 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది క్వింటాలుకు రూ. 8,667 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే క్వింటాలుకు రూ. 557 పెంచి ఇస్తుంది. ఏటేటా పత్తికి కనీస మద్దతు ధర  ఎక్కువగా లభిస్తుండటంతో రైతులు పత్తి బాట పడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కూడా పత్తి ధర ఎక్కువగా పలుకుతుంది.

పెరిగిన పత్తి సాగు...

వాణిజ్య పంటగా పేరొందిన పత్తి పంటని భీమిని మండలంలోని రైతులు వరి పంటను మించి ఈ ఏడాది సాగు చేశారు. మండలంలో సుమారు 24 వేల ఎకరాల్లో  పత్తి సాగు చేయగా, వరి సాగు 1,850  ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మద్దతు ధర కలిసి రావడం, అనుకూలమైన భూములు, ఆరుతడి పంట కావడంతో పత్తి పంట సాగు వైపు రైతులు చూపారు. నీటి వసతి ఉన్న చోట రైతులు వరికి ప్రాధాన్యమిస్తున్నారు.

సస్యరక్షణ చర్యలతోనే పంట దిగుబడి... ఎంఏఓ రజిత, భీమిని 

సస్యరక్షణ చర్యలతోనే పంట దిగుబడి పొందవచ్చు. ప్రస్తుతం పత్తి పంట పూత దశ నుంచి కాయలు ఏర్పడే దశలో ఉంది. ఈ వాతావరణ పరిస్థితులలో పత్తిలో వడల తెగులు వచ్చే అవకాశం నిండుగా ఉంది. ఈ తెగులు వస్తే మొక్కలు మధ్యాహ్నం పూట వడలి పోయినట్టుగా కనిపిస్తాయి. అధికంగా వర్షాలు పడడం వల్ల మొక్కలు భూమి నుంచి పోషకాలను గ్రహించలేకపోయి వడలి పోతాయి. దీని నివారణకు 2 శాతం యూరియా లేదా ఒక శాతం పోటాషియం నైట్రేట్ లేదా 19.19.19 ఎకరాకు ఒక కిలో చొప్పున పత్తి పంట పైన, ఆకుల పైన  పిచికారి చేయాలి.

అలాగే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును మొక్క మొదలలో నేలపైన పిచికారి చేయాలి. వర్షాధార పత్తి పంటలో పైపాటుగా నత్రజని(25 కిలోల యూరియా ఎకరానికి), పొటాషియం (10 కిలోలు మూయరేట్ ఆఫ్ పొటాష్ ఎకరానికి) ఎరువులను  విత్తిన 60 నుంచి 80 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. పత్తిలో తామర పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లి లీటర్ల ఫిప్రోనిల్ లేదా 1.25 గ్రాముల డైపెన్ తురాన్ లేదా 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల పంట దిగుబడి వచ్చి ఆర్థికంగా రైతు అభివృద్ధి చెందవచ్చు.

మరిన్ని వార్తలు