ఒక్క యూనిట్ రక్తం.. ఒక నిండు ప్రాణానికి భరోసా!
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం (Mega Blood Donation Camp) నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. పోలీసు అమరవీరులు ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా మరింత అంకితభావంతో ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను అర్పించినట్లే, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడంలో రక్తదానం (Blood Donation) కూడా కీలక పాత్ర పోషిస్తుందని డీసీపీ భాస్కర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో రక్తం ఎంతో అవసరమని, ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే ప్రాణదానంగా మారుతుందని తెలిపారు.
రక్తం అవసరమైన వారికి సకాలంలో సేవలందిస్తున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఎస్ఐలు, మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ జై భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్ మహేందర్, సీనియర్ మెంబర్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ పి. వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఏ.వి. రావు, లయన్ డాక్టర్ కే. సుగుణాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.