బందోబస్తును పరిశీలించిన సీపీ
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
దండేపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో( Sri Satyanarayana Swamy Temple) కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న కార్తీక జాతరను పురస్కరించుకుని చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆలయ ప్రాంగణంతో పాటు గూడెం - రాయపట్నం గోదావరి ఘాట్ వద్ద భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్, భక్తుల రాకపోకలు తదితర అంశాలను సమీక్షించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్లను క్రమబద్ధీకరించాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
వ్రతాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల్లో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతర సందర్భంగా భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేసి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాన రహదారులు, ఆలయ పరిసర ప్రాంతాలు,రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
గూడెం, రాయపట్నం గోదావరి ఘాట్ వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. నదిలోకి భక్తులు వెళ్లకుండా అవసరమైన చోట్ల భద్రతా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీసు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని కోరారు. నదిలో భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లను (శిక్షణ పొందిన ఈతగాళ్లను) అందుబాటులో ఉంచాలని,
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా రక్షణ చర్యలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా నిరంతర నిఘా, సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. మహిళలు,పిల్లలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
జాతర సందర్భంగా విధులు నిర్వహించే ప్రతి పోలీసు అధికారి,సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. సీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ సురేష్, దండేపల్లి ఎస్ఐ రాజవర్ధన్, ఇతర పోలీసు అధికారులున్నారు.