40శాతం లాభాల వాటా ను ప్రకటించాలి

04-10-2026 | 07:36pm

బెల్లంపల్లి: సింగరేణి సంస్థ(Singareni Company) 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ వార్షిక లాభాల నుంచి వాటా గా 40 శాతం వెంటనే ప్రకటించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్(Singareni Collieries Workers' Union (Central)) వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి కామ్రేడ్ దాగం మల్లేష్(Comrade Dagam Mallesh) డిమాండ్ చేశారు. సీ పీ ఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.  40% వాటా చెల్లించడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా TGGENCO, TGTRANSCOల నుండి సంస్థకు రావాల్సిన సుమారు రూ.59,000 కోట్ల బకాయిలను తక్షణమే సింగరేణి సంస్థకు చెల్లించాలని కోరారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా సంస్థ లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోందన్నారు. అయితే, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక లాభాలను ఇప్పటివరకు ప్రకటించకపోవడం పట్ల కార్మికవర్గంలో తీవ్ర ఆందోళన నెలకొన్నదనీ వాపోయారు.సింగరేణి సంస్థ అభివృద్ధిలో, బొగ్గు ఉత్పత్తి సాధనలో, సంస్థకు లాభాలు ఆర్జించి పెట్టడంలో కార్మికుల శ్రమ, అంకితభావం ఎంతో కీలకమైనదని తెలిపారు.

మరోవైపు, సింగరేణి సంస్థలో ఎన్నడూ లేనివిధంగా ఉత్పత్తికి, కార్మికుల రక్షణకు అవసరమైన మెటీరియల్, పరికరాల కొరత ఏర్పడుతున్నట్లు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు నిధులు లేవని యాజమాన్యం పేర్కొనడం  విడ్డూరంగా ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంతో పాటు, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి అవసరమైన పరికరాలు, మెటీరియల్‌ను సమకూర్చడం కంపెనీ బాధ్యతనీ గుర్తు చేశారు.

ఇదే పరిస్థితి కొనసాగితే, అక్టోబర్, నవంబర్ నెలల్లో కార్మికులకు చెల్లించాల్సిన పండుగ అడ్వాన్స్, లాభాల వాటా, దీపావళి బోనస్, పి.ఎల్.ఆర్.ఎస్. (PLRS) వంటి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులపై ప్రభావం పడే ప్రమాదం ఉందనీ తెలిపారు.. కార్మికులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందనీ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు