క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి
- 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం
- జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య(District Additional Collector P. Chandrayya) అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి-జిల్లా పంచాయతీ అధికారి కిషన్, ఎన్.సి.సి. కమాండెంట్లతో కలిసి టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే 15 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు.
టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు,
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో ప్రస్తుతం 265 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు.
సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. టి.బి. నిర్మూలనకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.