అన్నార్తుల చెంతకే..... ఆధి దేవుడి ప్రసాదం
- వినూత్నంగా వినాయక భక్త మండలి అన్నదానం
- ఐదేళ్లుగా నిర్వీగ్నంగా కొనసాగుతున్న వైనం
లక్షేట్టిపేట, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): సకల దేవతల కంటే ముందుగా పూజలందుకునే అధి దేవుడైన వినాయకుని మహా ప్రసాదాన్ని, పట్టణంలోని గాంధీ నగర్ వినాయక భక్త మండలి (Vinayaka Bhakta Mandali)నేరుగా అన్నార్థుల చెంతకే చేర్చి చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రతి ఆదివారం నిర్వహించే సంతలో ఆకలితో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు, ప్రజలకు స్వామి వారి ప్రసాదాన్ని వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో వినమ్రతతో పంపిణీ చేసి, తమ సేవా గుణాన్ని సభ్యులు చాటుతున్నారు. కేవలం మండపం వద్దనే కాకుండా నిరుపేదల చెంతకు అన్నదానాన్ని తీసుకెళ్ళి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పండుగ అంటే పూజలు, ఉత్సవాలతో పాటు పేదల ఆకలి తీర్చడమే నిజమైన భక్తి అని చాటి చెప్తున్నారు.
వేజిటబుల్ బిర్యానీ, మినరల్ వాటర్ పంపిణీ....
అంగడి బజార్, పాత బస్టాండ్ ఏరియాలో ప్రతి ఆదివారం జరిగే సంతకు మండలంలోని పలు గ్రామాల నుంచి వందల సంఖ్యలో వ్యాపారులు, ప్రజలు లక్షేట్టిపేటకు వస్తారు. ఈ సమయంలో కొందరు ఆకలిని తట్టుకుని కూడా తమ జీవనోపాధి కోసం రాత్రి వరకు పలు రకాల వ్యాపారాలను, పనులను నిర్వహిస్తారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు ఇబ్బంది పడవద్దని, నిరుపేదలకు వినాయకుని అమృతహారం అందాలనే సదుద్దేశంతో గాంధీ నగర్ వినాయక భక్త మండలి సభ్యులు ఈ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేకంగా తయారు చేసిన 300 వేజిటబుల్ బిర్యానీ బాక్స్ లు, సుమారు 500 మినరల్ వాటర్ బాటిల్లను చిరు వ్యాపారులకు, ప్రజలకు భక్తి భావంతో అందించారు.
ఆకలితో ఉండి, మండపం వద్దకు రాలేని వారికి స్వామి వారి ప్రసాదం అందించడంలో ఈ వినాయక భక్త మండలి సభ్యులు గత ఐదేళ్లుగా నిమగ్నమవుతున్నారు.భక్తుల ఆకలిని తీర్చేందుకే, ఆ మహా గణపతి స్వామి ఈ అన్న ప్రసాద వితరణను తమతో చేపిస్తున్నట్లు, ఇది తమ అదృష్టంగా భావిస్తున్నట్లుగా పలువురు సభ్యులు తెలిపారు.
ఆ ఆది దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సమస్త లోక సుఖినో భవంతు అనేదే మా అభిమతమని వివరించారు. అమృతాహారం అందించిన వినాయక భక్త మండలి సభ్యులను పలువురు చిరు వ్యాపారులు, భక్తులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వినాయక భక్త మండలి సభ్యులు చెట్ల రమేష్, పల్లెర్ల సురేష్, దుర్గాప్రసాద్, పల్లెర్ల మనోహర్,బొల్లం రామకృష్ణ, పల్లెర్ల శివకుమార్, కజ్జం రమేష్ బాబు, నల్మాస్ శ్రీనివాస్, గాదె శ్రీనివాస్, గోయికారి వాసు, బొద్దుకూరి రాజ్‌కుమార్,రాయించు రమేష్ తదితరులు పాల్గొన్నారు.