డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

06-10-2026 | 12:21am

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రుల రాక నేపథ్యంలో పనుల పరిశీలన

పులిచింతల ప్రాజెక్టు, 

గడ్డిపల్లి పాఠశాల, సయ్యద్ ముజావర్ పేట ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

సూర్యాపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు గాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు ముందుగా 

పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సమీపంలోని హెలిప్యాడ్‌లో దిగిన తదుపరి పులిచింతల హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను సందర్శించి,  టీజీ జెన్ కో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. తదుపరి గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లో రూ. 200 కోట్లతో  నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలిస్తారన్నారు. అక్కడి నుండి హెలికాప్టర్‌లో మునగాలకు చేరుకునీ మునగాలలో రూ.9.60 కోట్లు హరే కృష్ణ మూమెంట్ మిషన్ ఫౌండేషన్ ఆధునిక కమ్యూనిటీ కిచెన్‌కు భూమిపూజ చేస్తారన్నారు.

ముందుగా గడ్డిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పర్యటన సమయానికి అంతా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మునగాల మండలం సయ్యద్ ముజావర్ పేటలో నూతనంగా నిర్మించనున్న 'కమ్యూనిటీ కిచెన్' శంకుస్థాపన స్థలాన్ని, పులిచింతల మినీ హైడ్రాల్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన వేదిక ఏర్పాటు, భద్రత, ప్రోటోకాల్ అంశాలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎలాంటి లోటూ రానివ్వొద్దు : ముఖ్య నాయకులు, మంత్రుల పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పులిచింతల ప్రాజెక్ట్, గడ్డిపల్లి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మునగాల శంకుస్థాపన ప్రాంగణాల వద్ద ట్రాఫిక్, భద్రత, తాగునీరు తదితర ప్రాథమిక సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, కోదాడ ఆర్టీవో సూర్యనారాయణ, జన్ కో సిఈ నందేశ్ కుమార్ నారాయణ సింగ్ దేశ నాయక్, జెన్కో సిబ్బంది, తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు