శివ్వంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

23-11-2026 | 04:10pm

పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు...

శివ్వంపేట, నవంబర్ 23 (విజయక్రాంతి): శివ్వంపేట పోలీస్ స్టేషన్‌ను(Shivampet Police Station) తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్(Tupran DSP Narender Goud) సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పరిసరాలు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ క్రైమ్ కేసులు, కోర్టులో విచారణలో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. కానిస్టేబుల్ కిట్లు, సిబ్బంది నిర్వహణ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు నేరాలకు సంబంధించిన వాహనాలు, స్టేషన్ ఆవరణలో ఉన్న గుర్తుతెలియని వాహనాలను పరిశీలించారు.

అనంతరం సస్పెక్ట్, రౌడీ షీట్లను సమీక్షించి హిస్టరీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసులను త్వరితగతిన ఛేదించాలని, దర్యాప్తులో ఉన్న కేసులను వేగవంతం చేసి సకాలంలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. హిస్టరీ షీట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి డయల్‌-112 కాల్‌కు తక్షణమే స్పందించి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరుస్తూ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో తూప్రాన్ సీఐ వెంకటరాజు గౌడ్, శివ్వంపేట ఎస్సై మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు