యూసఫ్ పేట ఈశ్వరాలయంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
- మోదుగాకులలో అన్నప్రసాద వితరణ
- రామాయణం, మహాభారతం పోటీలు
పాపన్నపేట,సెప్టెంబర్21: మండలంలోని యూసఫ్ పేట గ్రామంలోని(Yousufpet Village) ఈశ్వర ఆలయంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవ వేడుకలు ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు, తీర్థ ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మనకు సనాతన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా, ఆరోగ్యకరమైన పద్ధతిలో మోదుగాకులలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా మోదుగాకులలో ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఆకట్టుకున్న రామాయణం, మహాభారతం పోటీలు
చిన్నారులకు, యువతకు మన ఇతిహాసాలైనా రామాయణం మహాభారతం గురించి అవగాహన కల్పించేందుకు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు విశేష స్పందన లభించగా, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు ఉత్సవ సమితి సభ్యులు జ్ఞాపికలు అందజేసి శాలువాళతో అభినందించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.