అట్టహాసం.. బతుకమ్మ సంబురం
- రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం
- హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్
- బతుకమ్మ పాటలతో మార్మోగిన ప్రాంగణం
- రంగురంగుల పూలు పేర్చి మహిళల ఆటపాటలు
అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి(Telangana Culture), సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) రవీంద్రభారతిలో శనివారం అట్టహా సంగా ప్రారంభమయ్యాయి. భాషా సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు వందలాది మంది మహిళలు తరలివచ్చారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పే ర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.
బతుకమ్మ పాటలతో రవీంద్రభారతి ప్రాంగణం మార్మోగింది. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన పూలను దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ఐక్యతా భావానికి ఈ పండుగ నిదర్శనమని అన్నారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మం త్రులు ఆకాంక్షించారు. తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించా రు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పె షల్ సీఎస్ వాణిప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్తోపాటు పలువురు కార్పొరేషన్ చైర్ పర్సన్లు, తదితరులు పాల్గొన్నారు.
శిల్పారామంలో...
శేరిలింగంపల్లి, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మాదాపూర్లోని శిల్పారామంలో బతుకమ్మ ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిల్పారామం మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సందర్శకులతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన శ్రీమతి పూర్ణిమ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే శ్రీమతి సంధ్యారాణి కోసూరు శిష్య బృందానికి చెందిన శ్రీనిక, ఇషిత, రుత్విక, మనస్విని, అనిష్క, ఆద్య సర్వాణి, జోషిత, ప్రణవి, శ్రీహంసిని, సమన్విత, ప్రవీణ్, ప్రశాంత్, కల్యాణి తదితర కళాకారులు పుష్పాంజలి, సప్తమాతృకా స్వరూపం, నవదుర్గ రూపం, అష్టలక్ష్మి స్తోత్రం, కృష్ణలీలలు తదితర అంశాలపై భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చి అలరించారు. సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ ఆటపాటలతో శిల్పారామం పండుగ శోభను సంతరించుకుంది.
ఘట్‌కేసర్ సర్కిల్‌లో..
ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : బతుకమ్మ పాటలతో ఘట్‌కేసర్ సర్కిల్ ప్రాంతంలోని వాడలు హోరెత్తాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రద్రాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండగ శనివారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. మహిళలు, యువతులు ఎంతో ఇష్టంగా పూల పండగ బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మలో మహిళలు, యువతులు బతుకమ్మ బతుకమ్మ సాంప్రదాయ గీతాలు ఆలపిస్తూ ఆటపాటలతో సంబురంగా జరుపుకొన్నారు.