స్క్రాప్ దుకాణంలో కత్తితో బెదిరించి రూ.25 వేల దోపిడీ
ఒకరి అరెస్టు.. మరో ఇద్దరి కోసం గాలింపు
మొయినాబాద్ అక్టోబర్ 10(విజయ క్రాంతి): స్క్రాప్ విక్రయిస్తామంటూ(Under the pretext of selling scrap) వచ్చి దుకాణంలో కత్తితో బెదిరించి నగదు, సెల్‌ఫోన్లు దోచుకెళ్లిన కేసులో ఒకరిని శంకర్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ నెల 8న తెల్లవారుజామున ఫతేపూర్ బ్రిడ్జి సమీపంలోని స్క్రాప్ దుకాణంలో నిద్రిస్తున్న రాజశేఖర్, అతని తమ్ముడు ఎల్లప్పను కత్తితో బెదిరించి రూ.25 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు దోచుకెళ్లారు. ఈ ఘటనలో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్ టోలిచౌకికి చెందిన మహ్మద్ రబ్బానీని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రూ.3,500 నగదు, సెల్‌ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహ్మద్ సోహెల్, మహ్మద్ అస్లాం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ వెల్లడించారు. సమావేశంలో శంకర్‌పల్లి ఇన్‌స్పెక్టర్ జి. రుద్రవీర్, డీఐ సమరం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.