రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేయించాలని వినతి

27-10-2026 | 07:52pm

ఘట్ కేసర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఘట్ కేసర్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తి చేయించాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, మాజీ ఎంపీటీసీ నందం గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్(District Congress President Thotakura Vajresh Yadav)ని కలిసి వినతిపత్రం అందజేశారు.

మా ప్రాంత ప్రజలు గత 18 సంవత్సరాలుగా ఘట్కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయా అని ఎదురుచూస్తున్నారని, ఈ ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ సత్తిరెడ్డి  డిసెంబర్ 2026 నాటికి పనులు పూర్తి చేస్తామని హామీ పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇంత నెమ్మదిగా పనులు కొనసాగితే మిగిలిన పనులు డిసెంబర్ లోగా ఎలా పూర్తవుతాయి అనే ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు. కావున మీరు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా, నియోజకవర్గ ఇన్చార్జిగా ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి, కాంట్రాక్టర్ సత్తి రెడ్డిని పిలిపించి, మిగిలిన పనులన్నింటినీ డిసెంబర్ 2026లోగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు.

వెంటనే స్పందించిన తోటకూర వజ్రేష్ యాదవ్ గురువారం మధ్యాహ్నం బ్రిడ్జి దగ్గరకు తానే స్వయంగా వచ్చి కాంట్రాక్టర్ సత్తిరెడ్డిని పిలిపించి పని మొదలు పెట్టి, ఇచ్చిన సమయం డిసెంబర్  2026 లోపల బ్రిడ్జి ని కంప్లీట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్ఛేందర్ రెడ్డి, కొండాపూర్ మాజీ సర్పంచ్ డక్కీ రమేష్, డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, మాజీ వార్డు సభ్యులు సల్లూరి నర్సింగరావు, డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి అబ్దుల్ ఖయ్యూం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోక మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు