సిబ్బంది సమిష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి

27-10-2026 | 08:27pm

ఆదర్శ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో మేడిపల్లి సీఐ డి. జలంధర్‌రెడ్డి

మేడిపల్లి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సిబ్బంది అంకితభావం, సమిష్టి కృషితోనే ఏ సంస్థ అయినా అభివృద్ధి సాధ్యమవుతుందని మేడిపల్లి సీఐ డి. జలంధర్‌రెడ్డి(Medipally CI D. Jalandhar Reddy) అన్నారు. మంగళవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల టీజీఎస్ ఆర్టీసీ డిపోలో సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ ఆదర్శంగా నిలిచిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సీఐ జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులను అంకితభావంతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడే సంస్థ మరింత బలోపేతమవుతుందని అన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, ప్రమాదరహిత రవాణా సేవలు అందించడం ద్వారా ప్రజల్లో ఆర్టీసీపై నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు.

ఆర్టీసీ అభివృద్ధి, మనుగడకు ఇంధన పొదుపు ఎంతో ముఖ్యమని, ప్రతి ఉద్యోగి ఇంధన ఆదాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, నిజాయితీ పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఉద్యోగుల సమష్టి కృషి, నిబద్ధతతోనే సంస్థ లక్ష్యాలను సాధించగలదని స్పష్టం చేశారు. అనంతరం సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ఆదర్శ ఉద్యోగులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సీఐ ఉదయ్‌భాస్కర్, డిపో మేనేజర్ స్వాతి, ఆర్టీసీ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు