మర్లపల్లి రైతుల ఫిర్యాదుపై ఎస్సీ కార్పొరేషన్ ఈడి విచారణ
బోథ్. అక్టోబర్ 27 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమం(Prajavani Program)లో మండలంలోని మర్రపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు శనగ విత్తనాలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అందులో భాగంగానే మంగళవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులైన మర్లపల్లి గ్రామానికి చెందిన రైతులను వివరాలని సేకరించారు. రైతులు తమకు 1500 కు ఇవ్వాల్సిన శనగ విత్తనాల బస్తాలను 1800 కు విక్రయించారని వివరించారు.
అనంతరం ఏవో రవితేజ ఏఈఓ లను విచారించారు. అయితే విత్తనాలు వచ్చిన వెంటనే రైతులు విత్తనాలు తక్షణమే ఇవ్వాలని కోరడంతో తాము ప్రభుత్వం నిర్ణయించిన ధరను తెలుసుకోకుండా ఇవ్వడం జరిగిందని అయితే 1500 రూపాయలు దరగా ఉందని తెలిసిన వెంటనే మిగతా డబ్బులు ఏవో ద్వారా రైతులకు ఫోన్ పే చేయడం జరిగిందన్నారు. కావాలని రైతుల నుండి డబ్బులు తీసుకోలేదని వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులను విచారించగా తమకు మాత్రం 1500 కు బస్తా ఇచ్చారని పేర్కొన్నారు. జరిగిన సంఘటన పైన పూర్తి విచారణ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఠాకూర్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.