నాట్స్ న్యూజెర్సీ చాప్టర్‌కు సాయి గంగుల నాయకత్వం
యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడమే లక్ష్యం
ఖైరతాబాద్,అక్టోబర్16(విజయాక్రాంతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్(NATS)) న్యూజెర్సీ చాప్టర్‌కు కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. చాప్టర్ లీడర్‌గా సాయి గంగులను(Sai Gangula) నియమించింది.నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని వెల్లడించారు. సామాజిక సేవ(Social Service) పట్ల అంకితభావం కలిగిన యువ నాయకుడు సాయి గంగుల నేతృత్వంలో న్యూజెర్సీలో నాట్స్ కార్యకలాపాలు మరింత విస్తరిస్తాయని రాజ్ అల్లాడ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించి,వారిని నాట్స్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంలో కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఛైర్మన్ కిశోర్ కంచర్ల అన్నారు.ఈ రాష్ట్రం నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం ప్రత్యేకమని పేర్కొంటూ,తెలుగు ప్రజలకు మరింత చేరువగా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ సమావేశానికి ఆప్టా,ఆత్మీయ,మాటా, తానా, టీఫాస్,ఎన్‌ఆర్‌ఐవీఏ తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు,నాట్స్ సభ్యులు,స్వచ్ఛంద సేవకులు,శ్రేయోభిలాషులు హాజరయ్యారు.తెలుగు సంఘాల మధ్య ఐక్యత,పరస్పర సహకారం, సామాజిక సేవ పట్ల ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ,బోర్డు సభ్యులు బిందు యలమంచిలి,టీపీ రావు,శ్యామ్ నాళం,మురళీకృష్ణ మేడిచెర్ల,శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరి పాల్గొన్నారు.
నాట్స్ జాతీయ స్పాన్సర్లైన నెక్సిల్లో హెల్త్ సంస్థకు చెందిన శశి పర్వతం,బులియన్ ఫార్చ్యూన్ సంస్థకు చెందిన కల్యాణ్ లక్కింశెట్టి,వంశీకృష్ణ కొప్పురావూరి కూడా హాజరై తమ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ సేవలను,నాయకత్వ పటిమను అభినందించారు. తెలుగు సంఘాలన్నీ సమష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్ శిబిరాలు,ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో నాట్స్‌తో కలిసి పనిచేయాలని కోరారు.తెలుగు సమాజంలో ఐక్యతను పెంపొందించడం,యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం,సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి లక్ష్యాల దిశగా నాట్స్ ముందుకు సాగుతోందని ఈ సమావేశం స్పష్టం చేసింది.