సర్వే నంబర్లు 3, 6, 7పై విచారణ జరిపించండి
- హైడ్రా కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన సెటిలర్స్ ఫోరం
- చాకలోని గండి పూడ్చివేత ఆరోపణలపై విచారణ జరపాలి
- వర్షాకాలంలో కాలనీలకు ముంపు ముప్పు లేకుండా చూడాలి
మేడిపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధి లోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు(Encroachment of government lands), సహజ నీటి ప్రవాహ మార్గాల పూడ్చివేత, ప్రధాన రహదారులపై ఆటంకాలపై సమగ్ర విచారణ జరిపించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ సెటిలర్స్ ఫోరం(Settlers Forum) ప్రతినిధులు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ను(HYDRA Commissioner A.V. Ranganath) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్వే నంబర్ 3లో ప్రభుత్వ భూముల ఆక్రమణల ఆరోపణలపై విచారణ జరిపించాలని, సర్వే నంబర్లు 6, 7 పరిధిలోని ‘చాకలోని గండి’ నీటి ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించాలని కోరారు.
నీటి ప్రవాహానికి అడ్డంకుల వల్ల వర్షాకాలంలో సమీప కాలనీలు ముంపు ముప్పును ఎదుర్కొనే ప్రమాదం ఉందని వివరించారు. బోడుప్పల్, చెంగిచెర్ల ప్రధాన రహదారిపై ఆక్రమణలు, ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, సర్వే శాఖల అధికారులతో సంయుక్త క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి, ఆక్రమణలు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు.
ఈ కార్యక్రమంలో సెటిలర్స్ ఫోరం ఛైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు కత్తి వెంకట్ రెడ్డి, సెక్రటరీ అల్వా అమర్ లింగా రెడ్డి, వైస్ చైర్మన్ శత్రుజ్ఞ, కేకే న్యూస్ సీఈఓ కమలాకర్, రాజు యాదవ్, సామల అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు వెంకటస్వామి, అడ్వైజర్ వెల్లంకి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.