తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారరికంగా నిర్వహించాలి
మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్(Medchal District BJP President Buddhi Srinivas) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విముక్తి కల్పించిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కొనియాడారు.
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిస్టాపూర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బిజేపి మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బుద్ధి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివని ఆయన స్పష్టం చేశారు.
నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేత,రజాకార్ల దౌర్జన్యాల నుండి విముక్తి కల్పించేందుకు పటేల్ చూపిన ధైర్యం, తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం తో చారిత్రక సత్యాలను భావితరాలకు అందించవచ్చని విక్రమ్ రెడ్డి స్పష్టం చేశారు.