కామారెడ్డి పట్టణ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు కృషి

16-09-2026 | 10:32pm

కామారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దృష్టికి పట్టణ సమస్యలను తీసుకెళ్లి రూ. 200 కోట్లు నిధులు మంజూరుకు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ను బుధవారం మున్సిపల్ పాలకవర్గం కలిసి విన్నవించింది.

కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయించాలని కోరారు. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్(Municipal Chairperson Eppa Umarani Srinivas), కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు బుధవారం కామారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో షబ్బీర్ అలీని కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన వివిధ సమస్యలు, అవసరాలను వివరిస్తూ రూ.200 కోట్ల నిధులు మంజూరు చేయించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్(Government Advisor Mohammed Ali Shabbir) మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాల్సి ఉందని తెలిపారు. రూ.200 కోట్ల ప్రతిపాదనపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని షబ్బీర్ అలీ తెలిపారు.

కామారెడ్డి మున్సిపాలిటీ ప్రతినిధులు అందించిన రూ.200 కోట్ల నిధుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, పట్టణానికి అవసరమైన అభివృద్ధి పనులపై సమగ్రంగా వివరించనున్నట్లు షబ్బీర్ అలీ తెలిపారు. “కామారెడ్డి పట్టణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం మనందరి బాధ్యత. మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు గుర్తించిన అవసరాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తాను” అని అన్నారు.

పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, పార్కులు, ప్రజా సౌకర్యాలు తదితర మౌలిక వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప శ్రీనివాస్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు అంజద్, షేరు, అన్వర్, కళ్లెం సత్యం, చిట్టిబాబు, సాయిలు, మాజీద్, లడ్డు, గోనె శ్రీనివాస్, అలీ బిన్ అబ్దుల్లా, భూపతి, సిద్ధిక్, యూనిస్, వాజిద్, కాళ్ల గణేష్, మహేష్, తాటి ప్రసాద్, మోతిలాల్, రామ్మోహన్, జావేద్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు