అసలేం జరిగింది?!
అనుపమ పరమేశ్వరన్ తాజా పోస్టుపై మళ్లీ చర్చ
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Actress Anupama Parameswaran) కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో ఉంటున్నది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా ఇతరుల గురించి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె పేర్కొనడం ఆసక్తిని కలిగిస్తోంది.
తన పోస్టులో అనుపమ మాట్లాడుతూ.. “ఒకప్పుడు కొన్ని పనులు చేసినప్పుడు తప్పు చేసినట్లుగా భావించేలా చేశారు. అదే పనులు ఇప్పుడు వేరే వ్యక్తులు చేస్తుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తున్నారు. సంతోషాన్ని వ్యక్తం చేయడం, తనను ప్రేమించేవారిని అభినందించడం, జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం వంటి సాధారణ విషయాలకే ఒకప్పుడు తప్పు చేసినట్లుగా భావించేలా చేశారు.
కానీ ఇప్పుడు అదే పనులు బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ తప్పుగా చూడటం లేదు. ఇక్కడ సమస్య మనం చేసిన పనిలో లేదు, ఆ పని చేయడానికి ఎవరికి అనుమతి ఉందనే విషయంలోనే అసలు తేడా ఉంది. సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడటం, వారి కామెంట్లకు స్పందించడం నాకు ఎప్పటి నుంచో అలవాటే.
ఇది నిన్న మొన్న మొదలుపెట్టిన పని కాదు మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు అభిమానులతో మాట్లాడుతూనే ఉంటా. అయితే ఎవరు ఎవరి కామెంట్లకు స్పందించారు? ఎవరి స్టోరీలకు రిప్లై ఇచ్చారు? అంటూ నన్ను ఇతరులతో పోల్చుతూ మెసేజ్‌లు చేయవద్దని కోరుతున్నా. అభిమానుల ప్రేమను నేను గౌరవిస్తా, కానీ సోషల్ మీడియా ఇంటరాక్షన్‌ను పోటీగా మార్చుకోవడం నాకు ఇష్టం లేదు.
ప్రేమ, కృతజ్ఞతలను ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రదర్శించాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నది. ఇటీవల ఈ బ్యూటీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి కూడా మాట్లాడింది. రెండేళ్లపాటు మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యానని, ఆ అనుభవాల నుంచి బయటపడి ఇప్పుడు ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది అనుపమ. ఆమె తాజా పోస్టులో మాత్రం ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. దీంతో అనుపమ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.