అనంతమైన ప్రతిభకు దాదా సాహెబ్ ఫాల్కే
- కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
- భారతీయ సినిమాకు చేసిన సేవలకు ప్రకటించిన కేంద్రం
- ఈ నెల 22న గుజరాత్లో అవార్డు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి
- అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
- ‘మాల్గుడి డేస్’ సీరియల్‌తో అనంత్ నాగ్‌కు దేశవ్యాప్త గుర్తింపు
కన్నడ నటుడు(Kannada actor) అనంత్ నాగ్(Anant Nag)కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Dadasaheb Phalke Award) దక్కింది. భారతీయ సినిమా(Indian Cinema)కు అందించిన సేవలు, విశిష్ట సినీ ప్రస్థానానికి గుర్తింపుగా 2024కు గాను ఈ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగం(Film Industry)లో సాగిన అనంత నాగ్ సుదీర్ఘ ప్రయాణం రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడింది. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
‘మాల్గుడి డేస్’తో దేశవ్యాప్త గుర్తింపు
1948 సెప్టెంబర్ 4న జన్మించిన అనంత్ నాగ్ పూర్తి పేరు అనంత్ నాగర్ కట్టె. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. కన్నడలో 250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లోనూ తన నటనతో మెప్పించారు. దూరదర్శన్‌లో శంకర్ నాగ్ దర్శకత్వంలో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆర్కే నారాయణ్ కథల ఆధారంగా తెరకెక్కించిన ఈ ప్రసిద్ధ టెలీ సీరియల్లో అనంత్ మిఠాయివాలా పాత్రను పోషించారు.
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్
అనంత్ సినీ ఇండస్ట్రీలో 2023 నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. థియేటర్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన 1973లో కన్నడ చిత్రం ‘సంకల్ప’తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1974లో ప్రసిద్ధ దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ‘అంకుర్’ అనే ఆర్ట్ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. శ్యామ్ బెనెగల్ రూపొందించిన ‘మంథన్’, ‘కొండుర’, ‘కల్యుగ్’ తదితర చిత్రాల్లోనూ అనంత్ కీలక పాత్రల్లో నటించారు.
‘బయలుదారి’ (1976), ‘బెంకియ బలే’ (1983), ‘ముంగారు మలే’ (2006), ‘గోధి బణ్ణ సాధారణ మైకట్టు’ (2016), ‘గాలిపట 2’ (2022)తోపాటు ‘నా నిన్న బిడలారే’, ‘గణేశాన మదువె’, ‘కన్నేశ్వర రామ ‘రాజకుమార’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలు ఆయన కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’ (2018), ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ (2022) చిత్రాల్లో సీనియర్ జర్నలిస్ట్ ‘ఆనంద్ ఇంగలగి’ పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు అనంత్ నాగ్. తెలుగులో ‘ప్రేమలేఖలు’, ‘అనుగ్రహం’, ‘భీష్మ’, ‘బాలు’, ‘శంఖారావం’ వంటి సినిమాల్లో నటించారు.
ఎన్నో అవార్డులు..
తన నటనకుగాను ఇప్పటికే 2025లో అనంత్ నాగ్ కీర్తి కిరీటంలో ‘పద్మభూషణ్’ చేరింది. ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, 5 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. వెండితెర మీదే కాదు కర్ణాటక రాజకీయాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. మల్లేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఇప్పుడు దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారం దక్కడంతో అభిమానులు, చిత్ర ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ అభినందనలు..
అనంత్ నాగ్‌ను అవార్డు వరించిన సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అద్భుతమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో, ముఖ్యంగా కన్నడ చిత్రసీమలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అనంత్ ఏ పాత్ర పోషించినా అందులో జీవించేవారని, ఈ అవార్డు ఆయన ప్రతిభకు దక్కిన సరైన గుర్తింపు అని రాసుకొచ్చారు. ఈ గౌరవానికి ఆయన అన్ని విధాలా అర్హులని ప్రధాని పేర్కొన్నారు.