గౌరవం తీసుకొచ్చే సినిమా గరివిడి లక్ష్మి
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు లెజెండరీ జానపద గాయని ‘గరివిడి లక్ష్మి(Garividi Lakshmi)’ కథను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటిస్తోంది. గౌరి నాయు డు జమ్ము ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హీరో తేజ సజ్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రఘురాం కృష్ణంరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో తేజ సజ్జా మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ బ్యానర్ లాంటిది. ‘గరివిడి లక్ష్మి’ లాంటి అద్భుతమైన కథను నిర్మించిన కృతికి అభినందనలు. ఈ సినిమా నేను చూశా. ఇది చాలా గౌరవం తీసుకొచ్చే సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే కాదు, ప్రేక్షకులకు, గరివిడి లక్ష్మి అభిమానులకు కూడా గౌరవం తీసుకొచ్చే సినిమా” అన్నారు.
కథానాయకి ఆనంది మాట్లాడు తూ.. “ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను మాటల్లో చెప్పలేను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తమ సొంతం చేసుకున్నారు. నేను చేసిన ప్రతి క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఎంతగానో ఆదరణ ఇచ్చారు. గరివిడి లక్ష్మి పాత్రలో నేను నటించినందుకు, దానికోసం మీరందరూ సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. సినిమా కథ విన్న తర్వాత గరివిడి లక్ష్మి పాత్రలో నటించాలని అనిపించింది. ఎంతోమంది క్రెడిట్ తీసుకోకుండా కళాకారులుగా ఉండిపోయారు. వాళ్లందరికీ రిలేట్ అయ్యే మూవీ ఇది.
వాళ్లందరికీ ఒక గుర్తింపు తీసుకురావడానికి చేసిన సినిమా ఇది. ఈ సినిమా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది” అని తెలిపింది. డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము మాట్లాడుతూ.. “ఒక జానపద కళాకారిణి గురించి సినిమా తీస్తే, ఆ సినిమాకు వస్తున్న అభినందనలు మామూలుగా లేవు. సినిమా రిలీజ్‌కు ముందే సక్సెస్‌ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ‘గరివిడి లక్ష్మి’ టీమ్ అందరం కృతికి రుణపడి ఉంటాం. సినిమా ఇంత బాగా రూపుదిద్దుకుందంటే దానికి కారణం కృతినే. ఆనంది గరివిడి లక్ష్మి పాత్రలో ఒదిగిపోయారు. ఆమెను మరో సావిత్రి అంటు న్నారు.
ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమా తర్వాత మీరందరూ తనను గరివిడి లక్ష్మి అని పిలుస్తారు” అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “ఉత్తరాంధ్రకు ధన్యవాదాలు. ఈ బయోపిక్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. విజయ శాంతికి ‘కర్తవ్యం’, సౌందర్యకి ‘అమ్మోరు’, అనుష్కకి ‘అరుంధతి’, కీర్తి సురేశ్‌కు ‘మహానటి’లాగా.. ఆనందికి ‘గరివిడి లక్ష్మి’ అలాంటి మంచి సినిమాగా నిలుస్తుంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ గౌరీకి థాంక్యూ” అని తెలిపారు.
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. “ఈ కథ చెప్పిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. ‘ఇవి కదా అసలైన పాటలు’ అనిపించింది. ఉత్తరాంధ్రకు నేను చాలా రుణపడి ఉంటా. చాలా రోజులుగా నాలో ఉన్న ఆకలిని ‘గరివిడి లక్ష్మి’ సినిమా తీర్చింది. నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌ను పూర్తిస్థాయిలో ఇండస్ట్రీకి చూపించడానికి ఈ సినిమా ఉపయోగపడింది” అని తెలిపారు. డైరెక్టర్ మోహన్ రాజా, రాగ్ మయూర్, చిత్రబృందం సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.