ఉపాధి హామీలో పారదర్శకత పెంచాలి
ఎంపీడీవో మూడు రాజు, ఏపీవో మాలోతు రాజు
వెంకటాపూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పనులు నిర్వహించాలని ఎంపీడీవో మూడు రాజు, ఏపీవో మాలోతు రాజు(APO Maloth Raju) సూచించారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో ఐఆర్ ఫంక్షన్ హాల్లో ఉపాధి హామీ మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు నిబంధనల ప్రకారం జరిగేలా క్షేత్రస్థాయి సిబ్బంది, మేట్లు బాధ్యతగా వ్యవహరించాలని, కూలీలకు పనులు కేటాయించడం, రోజువారీ హాజరు నమోదు, పనుల కొలతలు, వేతనాల చెల్లింపుల ప్రక్రియపై మేట్లకు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో ఇంకుడు గుంతలు, నీటి కాలువలు, ఫామ్ పాండ్స్ వంటి నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పనుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, అవకతవకలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు సురేష్, రాజేష్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు భాస్కర్, రాధిక, రామాచారి, సతీష్, సారంగపాణి, ఉపాధి హామీ మేట్లు పాల్గొన్నారు.