మున్సిపాలిటీలో పన్నుల మోత

31-10-2026 | 10:44pm

మున్సిపల్ కార్యాలయం ముందు వ్యాపారుల ఆందోళన 

అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయం ముట్టడి

ములుగు,(విజయక్రాంతి): ములుగు మున్సిపాలిటీ(Mulugu Municipal) పరిధిలో అడ్డగోలుగా పన్నులు పెంచడంతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం వందలాది మంది ప్రజలు, వ్యాపారులు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భువన సర్వే పేరుతో దోపిడీ జరుగుతుందని వాపోయారు. అధికారులు భువన సర్వే పేరుతో ఇష్టారీతిగా సర్వే చేసి పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు.

స్క్వేర్ ఫీట్ కు 20 పైసల నుంచి 1.75 కి పెంచామని కాగితాల్లో చూపుతూ వాస్తవంలో వందల్లో ఉన్న పన్నులను వేలల్లోకి, వేలల్లో ఉన్నవాటిని లక్షల్లోకి పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. 500 నుండి 1000 కట్టే సాధారణ ఇళ్లకు 10 వేల నుంచి 30 వేల వరకు పన్ను వేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.

అలాగే 10 వేలు ఉన్న సాధన, మిరాకిల్, సన్ రైజర్స్, అరవింద స్కూళ్లకు 4 లక్షల నుంచి 8 లక్షల వరకు, గతంలో 50 వేలు ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్ కు ఏకంగా 10 లక్షలకు పైగా పన్ను వేయడంతో చిన్న వ్యాపారాలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆందోళన సమయంలో కమిషనర్ కార్యాలయంలో లేకపోవడంతో ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీపీఓ కిరణ్, మేనేజర్ రాజేందర్ లను నిలదీసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం కమిషనర్ తో మాట్లాడి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా వెనుదిరిగారు.

100 పన్నును 150 చేస్తే భరిస్తామని, కానీ 100 ఉన్నదాన్ని 1000 చేయడం దోపిడీయేనని, ఇలాంటి అక్రమ పన్నులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పన్నుల పెంపుతో నష్టపోతున్న నూతన గృహ నిర్మాణదారులు, చిన్నా, పెద్ద వ్యాపారస్తులు, మున్సిపల్  వేసే ఇంటి పన్నుల బాధితులందరూ సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మున్సిపాలిటీ కమిషనర్ తో జరిగే సమావేశానికి తరలిరావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు