అబ్బురపరిచిన నృత్య ప్రదర్శనలు

02-11-2026 | 09:49pm

కొనసాగుతున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ శిక్షణ

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్పలో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ శిక్షణ శిబిరం(World Heritage Volunteers Training) సోమవారం పదకొండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉదయం యోగా గురువు రాంబాబు ఆధ్వర్యంలో వాలంటీర్లకు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి జియో హెరిటేజ్(Jio-heritage) ప్రదేశాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు, భూకంపాలు సంభవించినప్పుడు వాటిని ఎలా నమోదు చేస్తారు తదితర విషయాలను వివరించారు.

జియో హెరిటేజ్ ప్రదేశాల పరిరక్షణ ఆవశ్యకతను తెలిపారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి(Padma Shri awardee Padmaja Reddy) తన శిష్య బృందంతో కలిసి అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చి వాలంటీర్లను అలరించారు. కాకతీయ గజసైన్యాధిపతి జాయపసేనాని రచించిన 'నృత్తరత్నావళి' లోని పలు నృత్యరీతులను ప్రదర్శించారు. రామప్ప ఆలయ శిల్పాల్లో కనిపించే నృత్య భంగిమలను ప్రదర్శిస్తూ వాటి విశిష్టత, పేర్లను వివరించారు.

కాకతీయుల కాలం నాటి పేరిణి తాండవాన్ని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ వెలుగులోకి తీసుకువచ్చారని, తాను సైతం 12 సంవత్సరాల పాటు నృత్తరత్నావళిలోని నృత్యరీతులపై పరిశోధన చేసి వాటిని వెలికితీశానని పద్మజా రెడ్డి తెలిపారు. ఈ పరిశోధనకు గుర్తింపుగానే తనకు పద్మశ్రీ అవార్డు లభించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు ప్రొఫెసర్ పాండు రంగారావు, సభ్యులు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీధర్ రావు, శ్రీనివాస్, టూరిజం గైడ్లు విజయ్, వెంకటేష్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, శ్రీకాంత్‌తో పాటు పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు